
(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్.ఎల్.బి.సి.)కి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 06 సెప్టెంబరు, 2024.
ఛైర్మన్,
స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ,
C/o యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,
రాజరంగయ్యప్పారావు స్ట్రీట్,
విజయవాడ.
విషయం : వరద బాధిత కుటుంబాలకు బ్యాంకులు ఉదారంగా ఆర్థిక తోడ్పాటు అందించాలని కోరుతూ...
ఆర్యా!
బుడమేరు కాలువ వరద తాకిడికి అనూహ్య రీతిలో విజయవాడ నగరంలోని సింగ్ నగర్, వాంబే కాలనీ, ఖండ్రిక, ఆంధ్రప్రభ, వైఎస్సార్ కాలనీలు, భవానిపురం, గొల్లపూడి తదితర ప్రాంతాలతో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని అనేక గ్రామాలు ముంపునకు గురయి ఆయా ప్రాంత నివాసులను ఆర్థికంగా తీవ్రంగా దెబ్బ తీసింది. ఈ ప్రాంత జనాభాలో అత్యధికులు రోజువారీ కష్టం మీద, అసంఘటిత రంగంలోనూ, ఆటోలు నడుపుకుంటూ, చేతివృత్తుల మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నవారు. వ్యవసాయ కార్మికులు, పేదరైతులు సర్వస్వం కోల్పోవడమే గాక జీవనోపాధి లేదు. జీవితకాలం కష్టపడి సమకూర్చుకున్న ఇంటి సామానులు, వస్తువులు, నిత్యావసర సరుకులు సర్వం కోల్పోయి అత్యంత దయనీయ స్థితిలో ఉన్నారు.
ఇటువంటి విపత్కర పరిస్థితులలో వరద వలన నష్టపోయిన ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు కన్సంప్షన్ రుణాలు ఇవ్వాలని కోరుతున్నాము. డ్వాక్రా, తదితర రుణాల నెలవారి వాయిదాల చెల్లింపులకు కనీసంగా ఏడాది పాటు మినహాయింపు ఇచ్చి తదనుగుణంగా ఋణాలు రీషెడ్యూల్ చెయ్యాలని కోరుతున్నాము. అలాగే పంట నష్టం సంభవించిన రైతుల రుణాలు రీషెడ్యూల్ చెయ్యడంతో పాటు కొత్తగా పంట రుణాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
ఈ ప్రకృతి విపత్తు సమయంలో వరద బాధిత కుటుంబాలకు బేషరతుగా పై విధంగా ఆర్థిక తోడ్పాటు ఇచ్చేందుకు అన్ని బ్యాంకులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
అభివందనములతో...
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి