సిపిఐ(యం) ప్రధాన కార్యదర్శి కామ్రేడ్‌ సీతారాం ఏచూరికి నివాళి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 12 సెప్టెంబరు, 2024.
సిపిఐ(యం) ప్రధాన కార్యదర్శి
కామ్రేడ్‌ సీతారాం ఏచూరికి నివాళి
        సిపిఐ(యం) ప్రధాన కార్యదర్శి కామ్రేడ్‌ సీతారాం ఏచూరి ఈరోజు మధ్యాహ్నం
3.03 గంటలకు తుది శ్వాస వదిలారు. ఆయన గత కొద్దికాలంగా ఆల్‌ ఇండియా
ఇనిస్ట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో చికిత్స పొందుతున్నారు. శ్వాసకోస
సంబంధమైన ఇన్‌ఫెక్షన్‌తో ఆసుపత్రిలో చేరారు. అయితే వైద్యానికి ఆయన శరీరం
సహకరించనందువల్ల క్రమేపి ఇతర అవయవాలకు జబ్బు వ్యాపించడంతో ఈ రోజు
మరణించారు. ఎయిమ్స్‌ డాక్టర్లు డా॥ శ్రీనాథ్‌రెడ్డి, డా॥ గులేరియా లాంటి
నిపుణులైన వైద్యులు అహర్నిశలు కృషి చేసినా ఆయన ఆరోగ్యం మెరుగుకాకపోవడం
చివరికి ఈరోజు తుదిశ్వాస వదలడం కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు,
ప్రజాస్వామ్యవాదులు, లౌకికశక్తులకు ఎంతో బాధను మిగిల్చింది.
        కామ్రేడ్‌ సీతారాం ఏచూరి కాకినాడలో జన్మించారు. ఉద్యోగార్థమై వారి తండ్రి
ఢల్లీిలో ఉండడంతో ఆయన కూడా ఢల్లీిలో విద్యాభ్యాసం కొనసాగించారు. జెఎన్‌యూలో
అడ్మిషన్‌ పొందిన తరువాత ఆయనకున్న గొప్ప మేధోశక్తి, పరిణామాల్ని చక్కగా
విశ్లేషించగలిగే సామర్థ్యం మొత్తం విద్యార్థుల్ని ఆకర్శించి ఆయనను మూడు
సార్లు జెఎన్‌యూ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. వామపక్ష రాజకీయాల ప్రభావంతో
పనిచేస్తున్నందున ఎమర్జెన్సీలో ఆయనను అరెస్టు చేశారు. ఆ తరువాత దేశంలోని
ప్రజాస్వామ్య శక్తుల్ని, లౌకిక శక్తుల్ని ఐక్యం చేయడం కొరకు ఆయన అహర్నిశలు
కృషి చేశారు. ఆ క్రమంలోనే పార్టీలో పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, అనంతరం పార్టీ
ప్రధాన కార్యదర్శిగా ఎంపికై ఉద్యమ సారధిగా పనిచేస్తూ ఉన్నారు.
        సీతారాం గారు భారతదేశంలోని కమ్యూనిస్టులకే కాదు ఈ దేశంలోని వామపక్ష,
ప్రజాస్వామ్య, లౌకికశక్తులందరికీ స్పూర్తిప్రదాత. పార్లమెంటు సభ్యుడిగా ఆయన
చేసిన ఉపన్యాసాలు దేశాభివృద్ధికై అందులో తపన, ప్రజలందరి ఐక్యతకోసం ఆయన కృషి
చిరస్థాయిగా ఉంటాయి. అంతర్జాతీయంగా కూడా ఒక గొప్ప మార్క్సిస్టుగా గుర్తింపు
పొందినటువంటి వ్యక్తి కా॥ సీతారాం. అనేక దేశాల కమ్యూనిస్టు పార్టీల నాయకులు
ఆయనతో చాలా సన్నిహిత స్నేహ సంబంధాలను కలిగి ఉండేవారు.
        ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో ఆయనకు ఎంతో అనుబంధముంది. హైదరాబాద్‌లో బాల్యం,
విద్యాభ్యాసం గడిచింది. విజయవాడలో కూడా కొంతకాలం ఉన్నారు. కాకినాడ ఆయన
స్వస్థలం. ఆయన తల్లిని, బంధువులను కలవడానికి అప్పుడప్పుడూ వెళ్తుండేవారు.
గత 40 సంవత్సరాలుగా విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుండి ఇటీవల వరకు ప్రతి
సంవత్సరం ముఖ్యమైన సెమినార్‌లు, మహాసభలు, ఎన్నికలు బహిరంగ సభల్లో
పాల్గొనడానికి తరచూ ఆంద్రప్రదేశ్‌ వచ్చేవారు. 2024 మేలో జరిగిన ఎన్నికల్లో
3 రోజులపాటు విజయవాడతో సహా పలు జిల్లాల్లో సభల్లో పాల్గొన్నారు. పర్యటించిన
అన్నిచోట్లా క్రిందిస్థాయి కార్యకర్త వరకు ఆయనకు అనుబంధముంది.
        సీతారాం మరణం పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తన తీవ్రమైన సంతాపాన్ని
ప్రకటిస్తున్నది. ఆయన లేని కొరత పూడ్చలేనిదే అయినా మరింత బలమైన ప్రజా
ఉద్యమాల ద్వారా ఆ కామ్రేడ్‌ లేని కొరతను అధిగమించేలాగా కృషి చేస్తామని
రాష్ట్ర కమిటీ ప్రతిజ్ఞ తీసుకుంటున్నది. వచ్చే వారం రోజులపాటు కమ్యూనిస్టు
 కార్యాలయాలన్నింటా పార్టీ పతాకాలను అవనతం చేసి సంతాప దినాలుగా పాటించాలని
పార్టీ విజ్ఞప్తి చేస్తున్నది. కా॥ సీతారాం ఏచూరికి జోహార్లు
అర్పిస్తున్నాం. వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సంతాపాన్ని రాష్ట్ర కమిటీ
ప్రకటిస్తున్నది.
        పార్టీ రాష్ట్ర కమిటీ తరపున పార్టీ సీనిరయర్‌ నాయకులు పి.మధు,
కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు ఈనెల 14వ తేదీన ఢల్లీిలోని ఆయన
భౌతికకాయానికి నివాళులర్పించి అంత్యక్రియల్లో పాల్గొంటారు.

(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి

--
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
            Andhra Pradesh Committee
H.No. 27-30-9,Akula vari Street,
Governorpet, Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org