గొప్ప మేధావి ఏచూరి ఆయన మరణం తీరనిలోటు..

(ప్రచురణార్థం : ఈరోజు సిపిఐ(యం) రాష్ట్ర కార్యాలయంలో సిపిఐ(యం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి నివాళి కార్యక్రమం జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం, ప్రసారార్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

గొప్ప మేధావి ఏచూరి

ఆయన మరణం తీరనిలోటు

సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు గఫూర్‌

రాష్ట్రకమిటీలో ఆధ్వర్యంలో సంతాపం సభ 

సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం  ఏచూరి గొప్ప మేధావి అని ఆ పార్టీ కేంద్రకమిటీ సభ్యులు యం.ఏ. గఫూర్‌ అన్నారు. ఆయన మరణం వామపక్ష ఉద్యమానికి తీరని లోటు అని చెప్పారు. సిపిఎం రాష్ట్రకార్యాలయంలో ఏచూరి సంతాప సభ గురువారం  జరిగింది. ఈ సందర్భంగా గఫూర్‌ మాట్లాడుతూ   దేశ సమస్యలపై అనర్గళంగా మాట్లాడే వ్యక్తి ఏచూరి అని అన్నారు. దేశంలో ఉన్న మతోన్మాద ప్రభుత్వం నానాటికి మీతిమిరిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా లౌకిక శక్తులను ఏకం చేసే ప్రయత్నం సిపిఎం చేస్తోందని చెప్పారు. ఈ కర్తవ్యాన్ని నిర్వహించగల వ్యక్తి ఏచూరి అని చెప్పారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో  ఆయన సేవలు చాలా అవసరమని తెలిపారు. ఇలాంటి సమయంలో ఆయన మృతి పార్టీకి, వామపక్ష ఉద్యమానికి తీరని లోటు అని చెప్పారు. పార్టీ కార్యకర్తల పట్ల ప్రేమ, అప్యాయతతో ఉండేవారని చెప్పారు. తన జీవితాన్ని  పార్టీకి అంకితం చేశారని చెప్పారు. ఏచూరి అడుగు జాడల్లో నడుస్తూ బలమైన వామపక్ష ఉద్యమాన్ని నిర్మించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ 24వ మహాసభల ఏర్పాటుకు సన్నద్ధమవుతున్న ఈ సమయంలో ఏచూరి మరణం తీరనిలోటు అని చెప్పారు. పార్టీ సీనియర్‌ నాయకులు పి మధు మాట్లాడుతూ   సోవియట్‌ యూనియన్‌ కుప్పకూలిన సమయంలో సోషలిస్ట్‌ ఆర్ధిక వ్యవస్థకు భవిష్యత్‌ లేదని, కమ్యూనిస్టు సిద్ధాంతం ఆచరణలో సాధ్యం కాదని ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడీదారులు పెద్దఎత్తున దాడి చేశారని తెలిపారు.  మద్రాస్‌లో జరిగిన 14వ పార్టీ మహాసభలో ఈ దాడిని తిప్పికొడుతూ మార్క్సిజం లెనినిజానికి కాలం చెల్లిందనే ధోరణి సరైంది కాదని తీర్మానాన్ని ఏచూరి ముందుకు తీసుకొచ్చారని చెప్పారు. ఈ తీర్మానాన్ని మహాసభ ఏకగ్రీవంగా తీర్మానించిందని గుర్తుచేశారు. 

ఇతర సహచరులతో కలిసి దేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి, కార్మికులు, రైతాంగానికి అండగా సిపిఎంను నిలబెట్టేందుకు కృషి చేశారని చెప్పారు.  పార్లమెంట్‌లో ఏచూరి మాట్లాడే సమయంలో ఇతర పార్టీ సభ్యులు కూడా వినేందుకు సభలోకి వచ్చేవారని చెప్పారు. సిపిఐ రాష్ట్రకమిటీ తరపున ఆ పార్టీ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్‌  పాల్గని నివాలళర్పించారు. అనంతరం ఆయన కమ్యూనిస్టు ఉద్యమానికి ఏచూరి దూరం కావడం చాలా బాధాకరమని చెప్పారు. విద్యార్ధిగా ఉన్న సమయంలో ఢల్లీి జెఎన్‌యులో మూడు సార్లు విద్యార్ధినేతగా ఎన్నికయ్యారని చెప్పారు.  తమ పార్టీ కార్యాలయంలో సురవరం సుధాకర్‌ రెడ్డి, ఏచూరి చిత్రాలు ఉన్నాయని తెలిపారు. కమ్యూనిస్టు ఉద్యమాల్లో  మేథాస్సు కలిగిన నేతలు అని కొనియాడారు. సభకు అధ్యక్షత వహించిన సిపిఎం రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, వి ఉమామహేశ్వరరావు, సిహెచ్‌ బాబూరావు, మంతెన సీతారాం, ప్రభాకర్‌ రెడ్డి, డి రమాదేవి మాట్లాడుతూ పోరాటం, చదువు అని రూపొందించిన ఎస్‌ఎఫ్‌ఐ నినాదంలో ఏచూరి పాత్ర ఉందని అన్నారు.మార్క్సిజం, లెనినిజాన్ని పిడివాదం కాదని, నిర్దిష్ట పరిస్థితులకు నిర్దిష్టంగా అన్వయించడం ద్వారా ప్రజా విముక్తికి దోహద పడాలనే ఆలోచనతో ఏచూరి కృషి చేశారని చెప్పారు. యుపిఎ ప్రభుత్వ హయాంలో రూపొందించిన ఉపాధి హామీ, సమాచార హక్కు చట్టం, భూ సేకరణ చట్టం వంటి ప్రజా చట్టాల  రూపకల్పలలో ఏచూరి కీలక పాత్ర పోషించారని తెలిపారు. విద్యార్ధి ఉద్యమ దశలో ఏచూరి ఒక ఐకానిక్‌గా నిలిచారని అన్నారు. ఇందిరాగాంధీ సమయంలో విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్లారని తెలిపారు.  ఈ సభలో పార్టీ రాష్ట్రకమిటీ సభ్యులు వి.కృష్ణయ్య, పి.మురళీకృష్ణ, కె.స్వరూపరాణి, జె.జయరాం, డి.వి.కృష్ణ, యం.సూర్యారావు, అండ్ర మాల్యాద్రి, వై.అచ్యుతరావు, కె.ఉమామహేశ్వరరావు, ఎ.అశోక్‌ తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళల్పించారు. ప్రజానాట్యమండలి కళాకారులు ఉద్యమ గేయాలు ఆలపించారు.

= = = =