కౌలు రైతులకే నష్ట పరిహారం ఇస్తామన్న ప్రభుత్వం నిర్ణయం అమలు జరపాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 23 సెప్టెంబరు, 2024.

 

కౌలు రైతులకే నష్ట పరిహారం ఇస్తామన్న ప్రభుత్వం నిర్ణయం అమలు జరపాలి.

 

ఈ నెల ప్రారంభంలో వచ్చిన తుఫాను, తదనంతర వరదలకు రాష్ట్రంలో 6 జిల్లాల్లో సుమారు 5 లక్షల ఎకరాల పంటలు దెబ్బతిన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వరికి ఎకరాకు 10 వేలు, వాణిజ్య పంటలకు ఎకరాకు రూ.14వేలు నష్టపరిహారం రైతులకు త్వరలో చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పరిహారం కౌలు రైతులకే ఇస్తామని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పినా ఇంతవరకూ అమలు కాలేదు. ఇచ్చిన హామిని వెంటనే అమలు చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటి డిమాండ్‌ చేస్తున్నది.

వరదలకు బాగా దెబ్బతిన్న కృష్ణా, గుంటూరు, బాపట్ల, ఎన్‌టిఆర్‌, పల్నాడు, ఏలూరు జిల్లాల్లో నూటికి 80% వరకు కౌలు రైతులే ఉన్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఈ విషయం గమనంలో ఉంచుకొని పొలం యాజమాని సంతకం లేకుండా కౌలు రైతులకే నష్ట పరిహారం ఇస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఆచరణలో అందుకు విరుద్దంగా అధికార యంత్రాంగం వ్యవహరిస్తోంది. యాజమాని అనుమతి లేదని, భూముల సర్వే పూర్తి చేయలేదని, ఈ క్రాప్‌ కాలేదని, ఇంతకు ముందు ఇసిఆర్‌సి కార్డు లేదని అనేక వంకలతో కౌలు రైతులకు పంట నష్టం నమోదు చేయడం లేదు.

ఇప్పటికే రైతులు వరి పంటకు కౌలు కలుపుకొని రూ.50వేలు, వాణిజ్య పంటకు ఎకరాకు  రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టారు. కానీ వరికి ఎకరాకు రూ.25 వేలు, వాణిజ్య పంటలకు ఎకరాకు రూ.50వేలు ఇస్తామని చెప్పడం చూస్తే ఖర్చు పెట్టినదాంట్లో కనీసం సగం ఖర్చు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం లేదు. కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామి ప్రకారం కౌలు రైతులకే పూర్తి నష్టపరిహారం చెల్లించే విధంగా ఆదేశాలివ్వాలని కోరుతున్నాము.

డిమాండ్స్‌

1. భూయజమాని సమ్మతంతో సంబంధం లేకుండా వాస్తవ సాగుదారుల పేర్లతోనే ఈ క్రాప్‌  చేయాలి.  వారికే నష్టపరిహారాలు, పంటల భీమా, ఇన్‌పుట్‌ సబ్సిడి ఇవ్వాలి.

2. వరికి ఎకరానికి 25,000 నష్టపరిహారం ఇవ్వాలి.

3. కంద, పసుపు తదితర వాణిజ్య పంటలకు లక్ష రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. 

4. భూమి స్వభావంతో సంబంధం లేకుండా వేసిన ప్రతి పంటను ఈ క్రాప్‌ చేయాలి. పంట నష్టపోయిన ప్రతి ఎకరాకు నష్టపరిహారం చెల్లించాలి.

5. నీటి ముంపులో పాడైపోయిన మోటార్లను ఉచితంగా రిపేర్‌ చేయించాలి. వరదల్లో కొట్టుకుపోయిన మోటర్లు, ఆయిల్‌ ఇంజన్లను ప్రభుత్వం ఉచితంగా రైతులకు ఇవ్వాలి.

6. రెండవ పంట వేసుకొనుటకు మినుము, మొక్కజోన్న ఇతర విత్తనాలను ఉచితంగా ఇవ్వాలి.

7. ఉపాధి హామీ పనిదినాలు, అదనంగా నిధులు కేటాయించి కూలీల ద్వారా ఇసుక మేటవేసిన భూములను ప్రభుత్వమే బాగు చేయించాలి.

8. డ్వాక్రా రుణాలను రద్దు చేయాలి. కనీసంగా 6నెలల కిస్తి చెల్లింపులను వాయిదా వెయ్యాలి.

9. ప్రతీ కుటుంబానికి రూ.10వేలు నగదు, 6నెలలు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించాలి.

 

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి