భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది :05 డిసెంబర్, 2024.
అదానీ విద్యుత్ ఒప్పందాల రద్దుపై ప్రజలను తప్పుదారి పట్టించే ముఖ్యమంత్రి ప్రకటన
పార్లమెంటును, దేశాన్ని కుదిపేస్తున్న అదాని మహా కుంభకోణం మన రాష్ట్రం చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ ఒప్పందాలను రద్దు చేయకుండా దొడ్డిదారిలో కొనసాగించాలనుకోవడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తున్నది.
ముఖ్యమంత్రి నిన్న మీడియాతో మాట్లాడుతూ ఒప్పందాన్ని అధ్యయనం చేస్తున్నామని, రద్దు చేసుకుంటే ఫైన్ కట్టాల్సి వస్తుందని చెప్పటం శోచనీయం. 10 రోజుల నుంచి అధ్యయనం చేస్తూనే ఉన్నాము అని చెప్తున్నారు తప్ప అందులో ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదు. ఒప్పందం రద్దు చేసుకునే అవకాశం ఉందని ప్రముఖ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇఎఎస్ శర్మ ముఖ్యమంత్రి గారికి నేరుగా ఉత్తరం రాశారు. దానిపై కూడా ఆయన స్పందించలేదు.
అలానే మన రాష్ట్రానికి సరఫరా చేస్తామన్న విద్యుత్తును అదానీ సకాలంలో ఇప్పటివరకు సరఫరా చేయలేదు. అయినా దానిపై రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహించింది. దానికి ఆ కంపెనీ పైన ఎలాంటి సూట్ వేయటంగానీ, అపరాధ రుసుము వసూలు చేయడం కానీ చేయలేదు. ఒప్పందాన్ని ఉల్లంఘించిన అదాని కంపెనీపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా మనం ఫైన్ కట్టాలని చెప్పటం ప్రజల్ని తప్పుదారి పట్టించటమే. అవినీతి కేసులో అమెరికాలో కుతికల్లోతులో దిగబడి ఉన్న అదాని ఆనాటి రాష్ట్ర ప్రభుత్వానికి లంచం ఇచ్చి అధిక ధరలకు ఒప్పందం చేసుకున్నారు. తగ్గించే అవకాశం ఉన్నా 25 సంవత్సరాలు పాటు అదే ధరను కొనసాగించారు. దీనివల్ల లక్ష కోట్ల రూపాయల భారం ప్రజలపై పడుతుందని తెలుగుదేశం శాసనసభ్యులు అసెంబ్లీలో లేవనెత్తారు. అయినా ముఖ్యమంత్రి దీనిపై మౌనం వహించటం రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతుంది.
ఇప్పటికైనా ఎలాంటి సంకోచం లేకుండా ఒప్పందాలు అన్నిటిని రద్దుచేసి తక్కువ ధరకు ప్రజలకు విద్యుత్తు సరఫరా చేయాలని, స్మార్ట్ మీటర్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాము.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
--
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
Andhra Pradesh Committee
H.No. 27-30-9,
Akula vari Street,
Governorpet,
Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org