July

రాజ్యసభకు జీఎస్‌టీ బిల్లు !

జీఎస్‌టీ (వస్తువులు, సేవల పన్ను) బిల్లు చుట్టూ పరచుకున్న తెరలు తొలగబోతున్నాయి. ఈ బిల్లుకు సవరణలను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంగీకారం తెలిపాయి. దీంతో ఈ బిల్లును శుక్రవారం రాజ్యసభలో ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే నెల 12తో ముగియనున్న ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లోనే ఈ బిల్లు ఆమోదం పొందుతుందని ప్రభుత్వం ఆశాభావంతో ఉంది. 

దయాశంకర్‌కు అలహాబాద్‌ కోర్టులో చుక్కెదురు

పరారీలో ఉన్న భాజపా బహిష్కృత నేత దయాశంకర్‌ సింగ్‌కుఅలహాబాద్‌ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన అరెస్టుపై స్టే విధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. దయాశంకర్‌ అరెస్టుపై స్టే విధించేది లేదని లఖ్‌నవూ బెంచ్‌ తీర్పు చెప్పింది. దీనిపై యూపీ ప్రభుత్వం వారంలోగా స్పందించాలని సూచించింది.

పార్లమెంట్లో మోడీని నిలదీసిన రాహుల్

పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ డైరెక్ట్ అటాక్ చేశారు. ధరల పెరుగుదలపై నిలదీశారు. గతంలో హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచార సభలో మోదీ తాము అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చి ఆచరణలో విఫలమయ్యారని ఆరోపించారు. ధరలు తగ్గించే తేదీని ప్రకటించాలని రాహుల్ కోరారు. ధరలను ఎప్పుడు నియంత్రించగలరో, ద్రవ్యోల్బణాన్ని ఎప్పుడు తగ్గిస్తారో తెలపాలని డిమాండ్ చేశారు.

విభజన కేసు విస్తృత ధర్మాసనానికి

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజన కేసు విస్తృత ధర్మాసనానికి బదిలీ అయింది. హైకోర్టు విభజన తీర్పును సమీక్షించాలన్న వ్యాజ్యాన్ని సీజే ధర్మాసనం ... విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఏపీలోనే ఉండాలనే అంశాన్ని సమీక్షించాలని తెలంగాణ ప్రభుత్వం కోరిన విషయం తెలిసిందే.

పాక్లో రాజ్నాథ్ పర్యటన

కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ వచ్చే నెల 3,4 తేదీల్లో పాకిస్తాన్లో పర్యటించనున్నారు. ఇస్లామాబాద్లో జరిగే  దక్షిణాసియా ప్రాంతీయ సహకార కూటమి(సార్క్) హోంమంత్రుల సదస్సులో ఆయన పాల్గొంటారు.

భారత్ అమెరికా నిఘా విమానాల ఒప్పందం

నాలుగు నిఘా విమానాల కొనుగోలు కోసం అమెరికాతో భారత్ బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 6,700 కోట్లు) ఒప్పందం కుదుర్చుకుంది. దీర్ఘశ్రేణి సముద్ర నిఘా వ్యవస్థ కలిగిన, జలాంతర్గామి విధ్వంసక యుద్ధ విమానాలు ‘పోసిడాన్-8ఐ’(పీ-8ఐ)లను కొనేందుకు అమెరికా రక్షణ శాఖ, విమానాల తయారీ సంస్థ బోయింగ్‌తో దీన్ని కుదుర్చుకుంది. 

ప్రత్యేక హోదా బిల్లుపై షార్ట్ లిస్ట్‌

ఏపీ ప్రత్యేక హోదా బిల్లుపై రాజ్యసభలో ఎవరెవరు చర్చించాలో పార్లమెంట్ అధికారులు షార్ట్ లిస్ట్‌ను ఖరారుచేశారు. ఈ లిస్ట్‌లో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు జైరామ్‌ రమేష్‌, టి. సుబ్బరామిరెడ్డి, దిగ్విజయ్ సింగ్‌... అలాగే టీడీపీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్‌, సీఎం రమేష్, తోట సీతారామాలక్ష్మీ, గరికపాటి రామ్మోహన్‌రావు ఉన్నారు.

విమాన ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి

ఎయిర్‌ఫోర్స్‌ విమానం ఎఎన్‌-32 ప్రమాద దుర్ఘటనపై సమగ్రమైన దర్యాప్తు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు డిమాండ్‌ చేశారు. మంగళవారం సాయంత్రం బాధిత కుటుంబాలను పరామర్శించారు. తొలుత బుచ్చిరాజుపాలెంకు చెందిన నమ్మి చిన్నారావు, లక్ష్మీనగర్‌కు చెందిన నాగేంద్ర కుటుంబ సభ్యులను కలుసుకుని ఓదార్చారు. అనంతరం అక్కడ నుంచి వేపగుంటలోని గంట్ల శ్రీనివాసరావు, అప్పన్నపాలెంలోని సాంబమూర్తి ఇళ్లకు వెళ్లారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసి వారికి మనోధైర్యం కలిగించారు.

జికె.వీధి మండలంలోని 8 పంచాయతీలకు నిరంతర విద్యుత్‌ కల్పించండి

             జిల్లాలోని జికె.వీధి మండలంలోని 8 పంచాయతీలకు చెందిన 50 గ్రామాలకు నిరంతం విద్యుత్‌ సదుపాయం కల్పించాలని, సోలార్‌ విద్యుత్‌ కాంట్రాక్టర్‌పై చర్య తీసుకోవాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం నేతృత్వంలో ఆయా గ్రామాల నాయకులు మంగళవారం ఎపిఇపిడిసిఎల్‌ డైరెక్టర్‌ (ఆపరేషన్‌ ప్రాజెక్టులు) బి.శేషుకుమార్‌, చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ విజయలలితలకు వినతిపత్రం అందజేశారు.

Pages

Subscribe to RSS - July