February

బాబుకు భూ దాహం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భూ దాహం ఎక్కువైందని భూ హక్కుల పరిరక్షణ పోరాట కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ దడాల.సుబ్బారావు అన్నారు. వంశధార నిర్వాసితుల సంఘం ఆధ్వర్యాన బ్యారేజీ సెంటర్‌లో నిర్వాసితులు చేపడుతున్న దీక్షలు 15 రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలకు బుధవారం సంఘీభావం తెలిపిన అనంతరం సుబ్బారావు మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకుని కార్పొరేట్‌, విదేశీ సంస్థలకు కట్టబెట్టాలని ప్రయత్నిస్తోందన్నారు. రాష్ట్రంలో భూ బ్యాంక్‌ పేరుతో 15 లక్షల ఎకరాలను తీసుకుని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు.

వినాశనం చేస్తారా..?

కొవ్వాడ అణుపార్కును ఏర్పాటు చేస్తూ ఉత్తరాంధ్రను వినాశనం చేస్తారా అని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్‌.నర్సింగరావు అన్నారు. కొవ్వాడ అణుపార్కును వ్యతిరేకిస్తూ సిఐటియు ఆధ్వర్యాన 102 మంది కార్మికులు మంగళవారం రక్తదానం చేశారు. మండలంలోని అరిణాం అక్కివలసలో శ్యామ్‌పిస్టన్స్‌ ప్లాంట్‌-3 పరిశ్రమ వద్ద చేపట్టిన ఈ రక్తదాన శిబిరాన్ని నర్సింగరావు ప్రారంభిస్తూ మాట్లాడారు. ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉన్న దేశాల్లో నిషేధిస్తున్న ఇలాంటి పరిశ్రమలను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

దివీస్‌ ఔషద్‌ కంపెనీ విస్తరణ ప్రతిపాదన వద్దు

             భీమిలి మండలం చిప్పాడ దివీస్‌ ఔషద్‌ కంపెనీకి అనుబంధంగా కంచేరుపాలెంలో యూనిట్‌ 3 పేరుతో చేపట్టనున్న విస్తరణ ప్రతిపాదనను తక్షణమే వెనక్కి తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేశారు. అర్హులైన స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని, కాలుష్యాన్ని నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈమేరకు సోమవారం స్థానిక తహశీల్ధార్‌ కార్యాలయం ఎదుట పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. 

పునరావాస ప్యాకేజీ అమలుచేయాలి..

పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురవుతున్న భూములకు సంబంధించి ఎకరాకు రూ.20 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని మాజీ ఎంపీ మిడియం బాబూరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత సంఘం ఆధ్వర్యాన ముంపు గ్రామాల్లో జరుగుతున్న పాదయాత్రను ఆయన ప్రారంభించారు. 18 ఏళ్ళల నిండిన నిర్వాసిత యువతీ యువకులకు పునరావాస ప్యాకేజీ అమలు చేయాలన్నారు. నిర్వాసితుల ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు కేటాయించాలని కోరారు. బాధితుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, లేకుంటే రూ.5లక్షలు అదనంగా చెల్లించాలన్నారు.

ప్రభుత్వ తీరే కారణం:మధు

కాపు గర్జన సభ సందర్భంగా జరిగిన ఘటనలు దురదృష్ట కరం, ప్రజలు భద్రత కోరుకుంటారు, రైలు బోగీలు తగలబడడాన్ని ఎవరూ హర్షించరని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కార్యదర్శి పి మధు పేర్కొన్నారు. ప్రభుత్వం వాగ్దానాలు చేసి ఒక తరగతి ప్రజల్లో ఆశలు రేపడం, దీర్ఘకాలం నాన్చడమే ఈ పరిస్థితి రావడానికి కారణమన్నారు. వాగ్దానాలు అమలు పరచాలని ప్రజలు కోరిన నేపథ్యంలో వారితో సంప్రదింపులు జరిపి పరిస్థితి చేజారిపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వుంది. అయితే, అది ఆ పనిచేయకపోడం వల్లే ఇటువంటి ఘటనలకు దారితీసిందని ఆయన పేర్కొన్నారు.

రోహిత్‌ మృతికి నిరసనగా విద్యాసంస్థల బంద్‌..

హెచ్‌సియు విద్యార్థి వేముల రోహిత్‌ మృతికి కారకులైన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆందోళనలు ఉధృతం చేస్తోంది. సోమవారం నుంచి మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది..

తుని ఘటనపై చంద్రబాబు..

రాజకీయ ప్రయోజనం కోసమే వైసిపి, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ముందస్తు పథకంతోనే తూర్పుగోదావరి జిల్లా తునిలో భయానక వాతావరణాన్ని సృష్టించారని సిఎం చంద్రబాబు విమర్శించారు. అనుకోకుండా జరిగిన ఘటన మాత్రం కాదని, దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. తునిలో జరిగిన ఘటనపై రాష్ట్ర ప్రజలు ఆలోచించి, చర్చ జరపాలని విజ్ఞప్తి చేశారు. కాపులను బిసిల్లో చేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ఈ ఘటనతో కాపులకు ఎంతమాత్రం సంబంధం లేదని, కొన్ని విద్రోహశక్తులే ఇందుకు కారణమని అన్నారు.

కాపుగ‌ర్జ‌న ఉద్రిక్తం..

తూర్పుగోదావరి జిల్లా తునిలో ఆదివారం చేపట్టిన కాపు ఐక్య గర్జన సభ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బిసిలుగా గుర్తించే వరకూ చావోరేవో తేల్చుకుందామంటూ ముద్రగడ పిలుపునిచ్చారు. పావుగంట కూడా ప్రసంగించకుండానే ఆయన అనూహ్యంగా రైలు, రాస్తారోకోలకు పిలుపునిచ్చారు. దీంతో లక్షలాదిగా వచ్చిన ఆందోళనకారులు కొంతమంది రైలు పట్టాలపై బైఠాయించారు. మరికొందరు ముద్రగడతో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. మరింత రెచ్చిపోయిన ఆందోళనకారులు రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌లో14 రైలు బోగీలకు నిప్పంటించారు. 8 పోలీసు జీపులను తగులబెట్టారు. తుని రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు నిప్పంటించారు.

Pages

Subscribe to RSS - February