October

మావోయిస్టుల డెడ్ లైన్..

కిడ్నాప్‌ చేసిన ముగ్గురు గిరిజన నాయకుల విడుదలకు మావోయిస్టులు విధించిన గడువు మరో 36 గంటల్లో ముగియనున్నా.. ఇంతవరకూ ప్రభుత్వం తరపున ఎలాంటి ప్రయత్నాలూ ప్రారంభం కాలేదు. దీంతో కిడ్నా్‌పకు గురైన వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన పెరుగుతోంది. సోమవారం విశాఖ పర్యటనకు వస్తున్న సీఎం చంద్రబాబు ఈ విషయంపై స్పందిస్తారా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు బాక్సైట్‌ తవ్వకాల అంశంపై ప్రభుత్వ వైఖరిని 13వ తేదీలోగా ముఖ్యమంత్రి స్పష్టం చేయాలని మావోయిస్టులు డిమాండ్‌ చేయగా, ఈ విషయం ఇంతవరకు తమకు తెలియదని జిల్లా అధికారులు చెప్పడం గమనార్హం.

బీఫ్‌ ఎగుమతుల్లో బిజెపి వాటా..

లక్నో: గోమాంస భక్షణకు వ్యతిరేకంగా ప్రచారం సాగిస్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన బిజెపి ఎమ్మెల్యే సంగీత్‌సింగ్‌సామ్‌కు మాంసం ఎగుమతుల సంస్థలో వాటా ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. మీరట్‌ జిల్లాలోని సర్ధానా నియోజకవర్గం నుంచి 2012లో బిజెపి ఎమ్మెల్యేగా ఎన్నికైన సంగీత్‌కు అల్‌-దువా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కంపెనీలో వాటా ఉన్నది వాస్తవమేనని స్పష్టమైంది ఈ కంపెనీ బర్రె-దున్నపోతు, మేక,గొర్రె మాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తుంది. భారత్‌ నుంచి హలాల్‌ మాంసాన్ని అరబ్‌ దేశాలకు ఎగుమతి చేస్తున్న ప్రముఖ కంపెనీగా దీనికి పేరుంది.

అప్పుల్లో వుంటే ఆర్భాటాలా?:మధు

రాష్ట్రంలో ప్రజలకిచ్చిన వాగ్దానాల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు విమర్శించారు. ఒంగోలులో ఆదివారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగపూర్‌పై ఉన్న యావ ప్రజల సమస్యలపై లేదన్నారు. రాజధాని శంకుస్థాపన ఆర్భాటానికి కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చిం చడం అవసరమా అని ప్రశ్నిం చారు. శంకుస్థాపనకే రూ.400 కోట్లు, అతిథి మర్యాదలకు రూ.2.5కోట్లు, వేదికపై యాంకర్లకు రూ.10 కోట్లు కేటాయించారన్నారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో.. ఈ ఆర్భాటాలు ఎందుకని ప్రశ్నించారు.

అమరావతి పనులు ఆపండి:NGT

పర్యావరణ అనుమతులకు ఆమోదం లభించకుండా ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని ప్రాంతంలో ఎలాంటి పనులూ(నేల చదును, నిర్మాణాలు చేపట్టడం) చేయకూడదని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌(ఎన్‌జిటి) ఆదేశాలిచ్చింది. అలాగే నూతన రాజధాని ప్రాంతంలోని చిత్తడి నేలలు, ముంపు ప్రాంతాల గుర్తింపుపై పూర్తి నివేదికను తమకు సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను నవంబర్‌ 5వ తేదీకి వాయిదా వేసింది. ప్రతిపాదిత రాజధాని నిర్మాణ స్థలంలోని ముంపు ప్రాంతాలకు సరిహద్దులు నిర్ణయించాలని సూచించిన ట్రిబ్యునల్‌... అందులో ఎలాంటి నిర్మాణాలూ చేపట్టకూడదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

దాద్రీ ఘటనపై SFI ఆగ్రహం..

దాద్రీ ఘటనపై దేశ రాజధానిలోని విద్యార్థిలోకం కదం తొక్కింది. జెఎన్‌యూ, ఢిల్లీ యూనివర్సిటీ, జామియా వర్సిటీలకు చెందిన విద్యార్థులు సుమారు 400 మంది విద్యార్థులు ప్రధాని నివాసాన్ని ముట్టడించేందుకు మార్చ్‌ నిర్వహించాయి. ఆల్‌ ఇండియా స్టూడెంట్‌ అసోసియేషన్‌, ఎస్‌ఎఫ్‌ఐ, తదితర వామపక్ష, దళిత విద్యార్థి సంఘాలు ఈ నిరసనలో పాల్గొన్నాయి. ఫిరోజ్‌ షా రోడ్‌ కు చేరుకున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకొని పార్లమెంట్‌ స్ట్రీట్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. దాద్రీ ఘటనలో బాధితులకు న్యాయం చేయాలని ఘటన వెనుక ఉన్న కుట్రదారులకు శిక్ష పడేలా చేయాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. 

అవి మతోన్మాద ప్రణాళికలే:ఏచూరి

అగర్తలా : ఘర్‌వాపసీ, లవ్‌ జిహాద్‌, గో రక్ష వంటివి BJP మతోన్మాద ప్రణాళికలేనని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ విమర్శించారు. హిందూ ఓటు బ్యాంకును కొల్లగొట్టే ప్రయత్నం జరుగుతోందని, ఆరెస్సెస్‌ రాజకీయ ఆయుధం బిజెపి అని ఆయన అన్నారు. మోడీ పాలనలో పౌరాణిక గాథలతో భారత చరిత్రను నింపే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌ గజల్‌ గాయకుడు గులామ్‌ అలీ కార్యక్రమాన్ని శివసేన అడ్డుకోవటాన్ని ఏచూరీ తీవ్రంగా ఖండించారు.

క్షీణిస్తున్న జగన్‌ ఆరోగ్యం

ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నేత జగన్‌ చేపట్టిన నిరవధిక దీక్ష ఆదివారం ఐదో రోజుకు చేరింది. ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. షుగర్‌ లెవల్స్‌, పల్స్‌ రేటు పడిపోవడంతోపాటు బరువు తగ్గుతున్నట్లు వైద్యులు నిర్ధారించారని వైసీపీ వర్గాలు తెలిపాయి. దీక్షా శిబిరానికి వచ్చిన జగన్‌ సతీమణి వైఎస్‌ భారతి జగన్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. 

ముంబైలో శివసేన పైశాచికత్వం..

ముంబైలో శివసైనికులు మరోసారి రెచ్చిపోయారు. అబ్జర్వర్‌ అండ్‌ రిసెర్చ్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ సుదీంధ్ర కులకర్ణిపై దాడికి దిగారు. శివసైనికులు సుదీంధ్ర ముఖానికి నల్ల రంగు పూశారు. పాకిస్థాన్‌ కు చెందిన విదేశాంగ మాజీ మంత్రి ఖుర్షీ మహ్మద్‌ కసూరీ రచించిన పుస్తకం ఆవిష్కరణను ముంబైలో ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన కార్యక్రమాన్ని సుదీంధ్ర కులకర్ణి నిర్వహిస్తున్నారు. పాకిస్థానీ రచయిత పుస్తకావిష్కరణ ముంబైలో నిర్వహించ వీల్లేదని శివసేన హుకూం జారీ చేసింది. కాగా ఇదే విషయమై చర్చించేందుకు సుధీంధ్ర శివసేన అధినేత ఉద్ధవ్‌ థాక్రేను కలిశారు. వీరిరువురి చర్చలు విఫలం అయ్యాయి.

శంకుస్థాపనకి రూ400 కోట్లా?:మధు

 నల్లపాడులో నిరవధిక దీక్ష చేపట్టిన వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన దీక్షకు సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు మద్దతు తెలియజేసారు .. ఈసందర్భంగా ఆయన ప్రజలనుద్ధేశించి ప్రసంగించారు. చంద్రబాబు.. రోజు వారి ఉపన్యాసాలు వింటుంటే నిజాయితీ నశించిందని అనిపిస్తోందన్నారు. ప్రత్యేక హోదా కాదు...ప్యాకేజీలున్నాయని ఇప్పుడు మాట్లాడుతున్నారని తెలిపారు. కనీస నిజాయితీ లేదని, ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో నిజాయితీ లేదని విమర్శించారు. పీఆర్సీ 2013 అమలు జరగాల్సి ఉంటే 2014 నుండి అమలు చేస్తామని తెలిపారు.

ప్రజారోగ్యం పట్టని ప్రభుత్వం:కాశీనాథ్

విజయవాడలో డెంగ్యు , విషజ్వరాలతో ప్రజలు భాధ పడుతున్నా పాలకవర్గానికి  చీమకుట్టినట్లయినా లేదని సిపిఎం విజయవాడ నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ ఘాటుగా విమర్శించారు.సిపిఎం ఆధ్వర్యంలో విజయవాడ కార్పోరేషన్ కార్యాలయం వద్ద ప్రజారోగ్యంపై పాలకుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.

Pages

Subscribe to RSS - October