ఇటీవలి కాలంలో కేంద్రంలోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ వెంటవెంట జరుగుతున్న పరిణామాలు చూసే వారికి ప్రజాస్వామిక భావజాలం, ప్రజా ఉద్యమాల వారసత్వబలం తెలిసి వస్తున్నాయి. ఏడాది కూడా తిరక్కుండానే మూడు ప్రభుత్వాల పాలకులు తమను తాము సమర్థించుకోలేని స్థితిలో పడిపోతున్నారు. తమ ఆధిక్యత శాశ్వతమైనట్టు విర్రవీగినవారు అంతకంటే వేగంగా ఆత్మరక్షణ మార్గాలు అన్వేషిస్తున్నారు. రహస్య ఎజెండాలు లోపల పెట్టుకుని రాజకీయ బీరాలు పలికిన వారు రాజీ రాగాలాల పిస్తున్నారు. ఈ రాజీల వెనక రహస్యాలేమనే సందేహాలు, సవాళ్లు మీడియాలోనూ, సమాజంలోనూ వ్యక్తమవుతుంటే సర్దుకోలేక సతమతమవుతున్నారు.