ఆంధ్రప్రదేశ్ వర్షాకాలపు అసెంబ్లీ సమావేశాలు తూతూ మంత్రంగా ముగిశాయి. ఐదు రోజుల పాటు మాటల యుద్ధాలు, తోపులాటలు, వ్యక్తిగత దూషణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో అసెంబ్లీ దద్దరిల్లింది మినహా ప్రజోపయోగ చర్చలు, తదుపరి కార్యాచరణకు ఎలాంటి స్థానం లేకపోవడం దారుణం. విపక్షానికి అవకాశమివ్వడం, విపక్షం లేవనెత్తే అంశాలకు సమాధానాలివ్వడం, తద్వారా సమస్యల పరిష్కారానికి బాటలు వేయడం ప్రజాస్వామ్యంలో అధికారపక్ష కనీస బాధ్యత. అయితే, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం ప్రభుత్వం ఈ తరహా స్ఫూర్తిని మరచిన తీరు విస్మయాన్ని కలిగిస్తోంది.